ఎన్నెల్లో గోదారి... సూరీడు లేకపోయేసరికి జాబిలితో సరసాలు సాగిస్తూంది.
బ్రిడ్జ్ మీద హడావిడిగా పరిగెడుతున్న వాహనాల వెలుతురు నీళ్ళమీద బంగారు అలలను ఏర్పరుస్తున్నాయి. ఇంత ప్రశాంతంగా ఉన్న గోదారి... ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రాణాలు తీస్తుందన్న విషయం నా ఒక్కడికే కాదు మా పడవలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు.
“చీకటి పడినాక పడవెక్కడం ఎందుకు బాబు?” సణిగాడు నరసింహం. నేను నవ్వి ఊరుకున్నాను. రాజమండ్రిలో రైలెక్కాలంటే మా ఊరినుండి పడవెక్కాల్సిందే. హైవే మీద లారీలు కూడా ఆపరు. అంత చిన్న పల్లె అది.
గాలి చల్లగా వీస్తూ ఉంది. నిత్య గుర్తుకొచ్చి తల విదిలించేను. సరిగ్గా ఒక సంవత్సరం కింద ఇలాగే ఇద్దరం పడవనుంచి ఆ గాలితో మాట్లాడాలని చేసిన ప్రయత్నం కళ్ళముందు కదలాడింది. నిత్య పట్టుదప్పి పడవనుండి నీళ్ళలో పడిపోయింది. గోదారి ప్రేమగా ఆమెని అక్కున చేర్చుకొంది. నిత్య దొరికితే ఎవ్వరు మాత్రం వదులుకొంటారు?
మూడు నెలలు అలా పిచ్చివాడిలాగా బ్రతికాను. నిత్య తో పాటు జీవితం మీద ఆశలన్నీ కూడా గోదారిలో చేరిపోయాయి. ఒకటి రెండు సార్లు గోదారిలోకి దూకుదామని ప్రయత్నించానుగాని ధైర్యం లేకపోయింది.
నరసింహం నెమ్మదిగా భుజం మీద చెయ్యి వేశాడు. “వదిన గుర్తొస్తుందా బాబు?” తల అడ్డంగా ఆడించాను. అతను నమ్మలేదు. నమ్ముతాడని నేను అనుకోనుకూడా లేదు. అవతల గట్టు దగ్గరకు వచ్చింది. గట్టు మీద కాలు పెట్టినప్పుడు ఏదో తెలియని రిలీఫ్. నిత్య మరణం వల్ల నీళ్ళంటేనే భయమేర్పడిపోయింది.
రాజమండ్రి స్టేషన్ లో నరసింహం శెలవు తీసుకొని కాకినాడ ప్యాసింజర్ ఎక్కాడు. నేను గౌతమి ఎక్స్ ప్రెస్ లో ఎక్కి పడుకున్నాను... హైదరాబాదు కోసం నిరీక్షిస్తూ..
ప్రొద్దున్నే కలకల ధ్వనులతో మెలకువ వచ్చింది. సికిందరాబాద్ స్టేషన్. గబగబా దిగాను. ఎదురుగా సౌమ్య... వదిలి వెళ్ళి రెండు రోజులే అయినా యుగాలు గడిచినట్లనిపించి గట్టిగా గుండెలకు హత్తుకున్నాను. “అమ్మ నాన్న బాగున్నారా?” అడిగింది సౌమ్య తల నిమురుతూ. “నిత్య గుర్తొచ్చింది” అన్నాను కష్టం మీద.
ఇద్దరికీ తెలుసు... ఆ విషయం గురించి మాట్లాడడం ఇద్దరికీ నచ్చదని. కానీ అప్పడప్పుడూ అలా నోటివెంట నిత్య పేరు వచ్చేస్తూ ఉంటుంది. సౌమ్య కళ్ళలో నీళ్ళు చూడలేకపోయాను. ఒక్కగానొక్క కూతురు... నిండుగోదారి తీసుకెళ్ళిపోయింది. నా గుండె పగిలి పోయేటట్లున్నా సౌమ్య కోసం మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను.
సరదాగా పారే గోదారి... ఎంత మంది శత్రువులున్నారో తెలియదుగానీ వారి సంఖ్య రెండు కంటే ఎక్కువని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.
సమాప్తం.